కీర్తనలు శ్యామా శాస్త్రి కరుణజూడు నిన్నునమ్మిన వాడగదా
శ్రీ - మిశ్ర చాపు
పల్లవి:
కరుణజూడు నిన్నునమ్మిన వాడగదా ఇంత పరాకేలనమ్మా॥
అను పల్లవి:
సరసిజాసన మాధవ సన్నుత చరణా బృహన్నాయకి వేగమే॥
చరణము(లు):
దీనజనావన మూర్తివి నీవని నేను నిన్ను నెఱనమ్మితిని
గానవినోదిని ఘననిభవేణి కామితఫలదా సమయమిదే॥
నీమహిమాతిశయంబుల నెంతని నే జెప్పుదునో లలితా
హేమాపాంగీ హిమగిరిపుత్రీ మహేశ్వరి గిరీశ రమణి నీ॥
శ్యామకృష్ణ పరిపాలిని శూలిని సామజగమనా కుందరదనా
తామసంబిటు సేయక నా పరితాపములను పరిహరించిన నీవు॥
AndhraBharati AMdhra bhArati - SyAmA SAstri kIrtanalu - Lyrics ShyAma Sastry kIrtanalu - karuNajUDu ninnunammina vADagadA