Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 1-1
సంపుటము: 1-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
కలికి మరుఁడు సేసినాజ్ఞ కడవఁగ రాదురా
॥వలచి॥
అంగడి కెత్తినట్టి దివ్వె లంగన ముఖాంబుజములు
ముంగిటి పసిఁడి కుంభములును ముద్దుల కుచయుగంబులు
యెంగిలి సేసినట్టి తేనె లితవులైన మెఱుఁగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు
॥వలచి॥
కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలో నీడలు యెడనెడ కూటములు
తెంచఁగరాని [1]వలెతాళ్ళు తెలివిపడని లేఁతనవ్వులు
మంచితనములోని నొప్పులు మాటలలోని మాటలు
॥వలచి॥
నిప్పులమీఁద జల్లిన నూనెలు నిగిడి తనివిలేని యాసలు
దప్పికి నేయి దాగినట్లు తమకములోని తాలిమి
చెప్పఁగరాని మేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పని కరుణ గలిగి మనుట అబ్బురమైన సుఖములు
॥వలచి॥

[1] ‘వల’ కావచ్చు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము