Display:
శృంగార సంకీర్తన
రేకు: 1133-3
సంపుటము: 21-190
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఏల సిబ్బితిపడేవు; యేమి సేసేది; నీవు
యేలిక విందరికైతే ఇంతలోనే తప్పెనా
॥పల్లవి॥
చెనకి నీమదిలోని సిగ్గులు వాపేకొరకే
ననుపుసేసుక నీతో నవ్వితి నేను
మనసు రంజిల్లఁజేసి మాటలాడేకొరకే
చనవుసేసుకొని సరుసఁ గూర్చుంటిని
॥ఏల॥
ముంచిననీమొగమోటములు దీరిచేకొరకే
వంచనతో నీయింటికి వచ్చితి నేను
కొంచిననీమేనియళుకులు మానిపేకొరకే
అంచెలఁ బైకొంటి నీకంటె ముందు నేను
॥ఏల॥
చేసిననీచేతఁలెల్లా జెల్లఁబెట్టేటికొరకే
మూసి దించి కాఁగిలించి మొక్కితి నీకు
వాసుల శ్రీవేంకటేశ వలపుఁరేఁచేకొరకే
రాసికెక్కి నీకిచ్చకురాల నైతి నేను
॥ఏల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము