Display:
శృంగార సంకీర్తన
రేకు: 1136-3
సంపుటము: 21-208
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
అలుగకువే నీవు అందుకెల్ల నాతనితో
చలములేకుండాఁ దెలుసుటగాక
॥పల్లవి॥
వాడికెమాట లాడితే వద్దనఁగవచ్చునా
యీడుజోడు లందులోన యెంచుటగాక
జాడతో నవ్వు నవ్వితే సాదించవచ్చునా
సూడుఁబాడుఁ గాకుండ సోదించుటగాక
॥అలు॥
తప్పకచూచితేనే తమకించవచ్చునా
కప్పి వెంగెములేకుండాఁ గనుటగాక
ముప్పిరిఁ జేయివట్టితే మొనచూపవచ్చునా
చొప్పుగా బాసలు సరిచుచుకొంటగాక
॥అలు॥
చిమ్మిరేఁగఁ గూడఁగాను సిగ్గువడవచ్చునా
నిమ్మలాన నేరుపులు నించుటగాక
యిమ్ముల శ్రీవేంకటేశుఁ డింతలో నిన్నుఁ గలసె
యెమ్మె చూపవచ్చునా యెఱుఁగుటగాక
॥అలు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము