Display:
శృంగార సంకీర్తన
రేకు: 1182-6
సంపుటము: 21-426
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఎక్కడ పరాకు నీకు నింతకంటె నేమున్నది
చిక్కనాయఁ గోరికలు చిత్తగించవయ్యా
॥పల్లవి॥
సెలవినవ్వు చిందఁగాఁ జెక్కునఁ జేయివెట్టె
పులకపైరు పయ్యదఁ బొదిగ నిదె
కొలఁదిమీరె వయసు కొప్పు గట్టిగా ముడిచె
చెలియసింగారము చిత్తగించవయ్యా
॥ఎక్క॥
చిమ్ముఁజూపులు మీఱఁగా చెంపల గందాలు వూసె
ముమ్మరమై మేలు పోఁకముడి వేసెను
చెమ్మగిలె మోవితేనెఁ దమ్మరసములు నించె
చిమ్మిరేఁగె సొబగులు చిత్తగించవయ్యా
॥ఎక్క॥
చనుమొనల కడ్డము సరినిన్నుఁ గాఁగిలించె
ఘనమైనరతులను కళరేఁగెను
యెనసితివి శ్రీవేంకటేశ యీయింతిని నీవు
చెనకులమురిపెము చిత్తగించవయ్యా
॥ఎక్క॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము