Display:
శృంగార సంకీర్తన
రేకు: 1183-1
సంపుటము: 21-427
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
ఏమి బాఁతి నేఁ దనకు యెందాఁకనే
యీమాట నిజమయ్యే దెందాఁకనే
॥పల్లవి॥
పన్ని యలిగితినంటా పలుమారు దూరిదూరి
యెన్నిమాట లాడీని యెందాఁకనే
వెన్నెలనవ్వులు నవ్వి వేఁడుకొని చెక్కునొక్కి
యెన్ని నేఁ జెప్పిన మానఁ డెందాఁకనే
॥ఏమి॥
గక్కునఁ దా లేచివచ్చి కప్పురవిడెమిచ్చీ
యెక్కడిసుద్దు లింకా నెందాఁకనే
పక్కన నానలు వెట్టి పచ్చడము గప్పి లోలో
ఇక్కువ లిదివో యంటె యెందాఁకనే
॥ఏమి॥
పచ్చి మాఁటలెల్లా నాడి బలిమిఁగాఁగిటఁ బట్టి
యిచ్చీఁ బంతములు తానెందాఁకనే
ఇచ్చట శ్రీవేంకటేశుఁ డింతటఁ దా నన్నుఁ గూడె
హెచ్చి సరసములాడె దెందాఁకనే
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము