Display:
శృంగార సంకీర్తన
రేకు: 1202-1
సంపుటము: 22-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
నీమనసు కోమలము నేనెఱుఁగుదును నీవు
భామ చేఁతలకు వేరే పదరేవు సుమ్మీ
॥పల్లవి॥
సగము గోపించి సతి సగము నవ్వె నీవు
మెగిఁ బయ్యదంటితి నీ మోము చూడఁగా
పగ పాడిగాదు నీతోఁ బరిఁహాచకము గాదు
యెగసక్కెమని ఇది యొగ్గువట్టేవుసుమ్మీ
॥నీమ॥
పేరుకొని నిన్నుఁ దిట్టి ప్రియముచెప్పెను చెలి
గోర నిన్ను నెచ్చరించి కుంగి మొక్కఁ గా
బారిజగడము గాదు పంతమిచ్చుటాఁ గాదు
వైరమాయనని పొందు వదలేవుసుమ్మీ
॥నీమ॥
ఆకడిమోమై ఇంతి ఆయమంటి నిన్నుఁ గూడె
జోకగా రతిబంధము చూపఁ గా నీవు
కైకొనకుండుట గాదు కడుఁ దమకము గాదు
యేకమై శ్రీవేంకటేశ యెడ సేవుసుమ్మీ
॥నీమ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము