Display:
శృంగార సంకీర్తన
రేకు: 1268-1
సంపుటము: 22-403
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
వేరే నేము సేసేటి విన్నపము లేమున్నవి
చేరి నీవే జవరాలిఁ జిత్తగించవయ్యా
॥పల్లవి॥
జలజలరాలీని సతికొప్పున విరులు
సెలవులఁ జిందీని చిరునవ్వులు
నిలువున వడీసీని నిండాఁ బెఁజెమటలు
కలికివలపు నీవే కనుఁగొనవయ్యా
॥వేరే॥
ముక్కున నిట్టూర్పులు మునుకొని నిగుడీని
చెక్కులపైఁ బులకలు చిమ్మిఁరేగీని
జక్కవచన్నుల మీఁద జారీఁ బయ్యద కొంగు
పక్కన నీమనసారఁ బలికించవయ్యా
॥వేరే॥
తేటలుగా బెదవిపైఁ దేనియ లూరీని
కోటిసేయ మోమున సిగ్గులు మించీని
యీటున శ్రీవేంకటేశ యీకె యలమేల్‌మంగ
గాఁటానఁ గూడితి విట్టే కరుణించవయ్యా
॥వేరే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము