Display:
శృంగార సంకీర్తన
రేకు: 1302-1
సంపుటము: 23-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరినాట
సొరిది నీపంతాలెల్లాఁ జూచేరా నేను
సిరుల నీ కోరికలు చెల్లించేరా నేను
॥పల్లవి॥
అంతేసి నాకేమి చెప్పే వందుకేమి కానీలేరా
వింతలు నీసఁతలెల్లా వింటిరా నేను
యెంతకెంత నీతోను యిప్పటనుండీ నేల
చెంత నీచిత్తమురాను సేసేరా నేను
॥సొరి॥
నన్నేమి చెక్కు నొక్కేవు నవ్వువచ్చీ నాయలేరా
కన్నులారా నీఁచేతలు కంటిరా నేను
సన్నలా చాయలా నిన్ను సాదించఁగ మరియేల
మిన్నక కూచండ నిన్నే మెప్పించేరా నేను
॥సొరి॥
సారెఁ గాఁగిలించేవు చలములు దీరెలేరా
చేరి నీపొందులఁ దనిసితిరా నేను
యీరీతి శ్రీవేంకటేశ యిఁకఁ గాదనఁగనేల
కూరిమితో నిన్ను వేఁడుకొనేరా నేను
॥సొరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము