Display:
శృంగార సంకీర్తన
రేకు: 1323-4
సంపుటము: 23-136
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
అందువంకనైనాఁ గొంత ఆతుమ దనుసును
పొందులన్నియునుఁ దలపోసుకొనవయ్యా
॥పల్లవి॥
పెక్కుసతులమీఁదను ప్రియముగలవాఁడవు
వొక్కతే నీరతులకు నోపుదునా
గక్కన నీమనసు కరఁగేయట్టుగాను
తక్కక మరీఁగొందరిఁ దలఁచుకోవయ్యా
॥అందు॥
నానావిధాలవారితో ననిచినవాఁడవు
నేనొక్కతె నవియెల్లా నేరుతునా
సోనగా మైచెమరించి చొక్కేయట్టుగాను
తానకపుకతలెల్లాఁ దలఁచుకోవయ్యా
॥అందు॥
చెంచులా గొల్లెతలా మెచ్చినయట్టివాఁడవు
మించి నేనొక్కతెనే మెప్పించేనా
కొంచక శ్రీవేంకటేశ కూడితి వైనట్టుగాను
దంచక నావంటి దేది తలఁచుకోవయ్యా
॥అందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము