Display:
శృంగార సంకీర్తన
రేకు: 1324-5
సంపుటము: 23-143
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎదురాడఁజాలదు యేమిసేసినా నీకు
వదలుఁ దురుమువట్టి వంచకువయ్యా
॥పల్లవి॥
చెక్కునఁ జేయివెట్టుక చింతించేచెలియకు
పుక్కిటితమ్ముల మిడి పొదిగేవు
వెక్కసపువిరహాన వేగించె నిందాఁకా
పిక్కటిల్లుఁజన్నులు పిసుకకువయ్యా
॥ఎదు॥
వుమ్మగిలుఁజెమటచే నోలలాడేమగువను
కమ్ముక యిప్పుడు వచ్చి కాయమంటేవు
నెమ్మనపుఁదమకాన నెరి నలసె నిందాఁకా
బిమ్మిటిగాఁ జేయివట్టి పెనఁగకువయ్యా
॥ఎదు॥
వుసురసురనుకొంటానుండేయల మేలుమంగను
పొసగించి కూడి యిట్టె భోగించితివి
యెసఁగ శ్రీవేంకటేశ యెనసె నిన్నిందాఁకా
వెస మోవి గంటిగావించకువయ్యా
॥ఎదు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము