Display:
శృంగార సంకీర్తన
రేకు: 1363-4
సంపుటము: 23-376
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
దేవతలు సేవించఁగా దివ్యదుందుభులు మ్రోయ
శ్రీవల్లభుని భావము చెలులెల్లఁ జూడరే
॥పల్లవి॥
నిండుసింగారముతోడ నిలవుగోణముగట్టి
అండఁ బన్నీటిమజ్జన మవధరించి
దండిగాశిరసున తడిసూడులు చుట్టుక
వుండెడిదేవునిభావ మువిదలుచూడరే
॥దేవ॥
కప్పురకాపు మేన కలయఁగ మెత్తిమెత్తి
చిప్పిలఁ దట్టుపుణుఁగు చికిలిసేసి
చొప్పుగానవరత్నాలసొమ్ములు మేనఁజాతి
ఇప్పుడున్న హరిభావ మింతులెల్లఁ జూడరే
॥దేవ॥
అలమేలుమంగ నురమందు నెలవుకొలపి
తలకొన నంతటాఁ బూదండలు వేసి
చెలరేఁగియారగించిశ్రీవేంకటేశ్వరుఁడు
కొలువైవున్న భావము కొమ్మలెల్లఁ జూడరే
॥దేవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము