Display:
శృంగార సంకీర్తన
రేకు: 1406-2
సంపుటము: 24-32
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఆరజమైతిని అంగడికెక్కితి
తారుకాణ లిఁకఁ దనతో నేలా
॥పల్లవి॥
పూవక పూచెను పున్నమవెన్నెల
కావక కాచెను కంతుబాణములు
యీవల నిఁక మరి యేలా మాఁటలు
ఆవలఁ దనచెలు లాడే రదివో
॥ఆర॥
కానక కనెనట కమ్మఁజెఱకువిలు
పూని వినకవినెఁ బొత్తులగాలెట
నానాఁటికి నివె నడచీ సుద్దులు
తానే యెఱుఁగును తమకములేలా
॥ఆర॥
పాఁకెను తీగెలు బయలుపందిలులు
మూఁకలు విచ్చెను మొకరితుమ్మిదలు
యీకడ శ్రీవేంకటేశుఁడు గాఁగిటఁ
జేకొనె నిదె మదిఁ జింకలవేలా
॥ఆర॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము