శృంగార సంకీర్తన
రేకు: 1448-5
సంపుటము: 24-287
రేకు: 1448-5
సంపుటము: 24-287
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
నీయిచ్చలోదాన నేను నీ యితవే చూతుఁగాక ఆ యింతిని మారుకొన నరుదా నాకు | ॥పల్లవి॥ |
యెలమి నీచిత్త మెప్పు డెట్టుండునో అనికాక నెలఁతతోఁ బంతమాడనేరనా నేను చెలికి నేమేమి బాసచేసితివో అనికాక తలకొని మట్టుపెట్టఁదడవా నాకు | ॥నీయి॥ |
యీసతిపై నే మోహ మెంతగద్దో అని కాక వూసివాసు లెంచి మీరనోపనా నేను వేసటతో నీమోము విన్ననౌనో అనికాక తోసి యాపెయెమ్మె మాన్పదొడ్డా నాకు | ॥నీయి॥ |
చెలఁగి నీవేడుకలు చెల్లింతు ననికాక యలయిం చాపెను గెల్వ నెదురా నాకు అలమేల్ మంగనే నేను అట్టె శ్రీవేంకటేశుడ కలసితాపెను సాటిగలదా నాకు | ॥నీయి॥ |