Display:
శృంగార సంకీర్తన
రేకు: 1448-6
సంపుటము: 24-288
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
కొమ్మలకు నిట్టి వోజ కోటిసేసును
సమ్మతిగా నడచుటే సంసారఫలము
॥పల్లవి॥
నను పెంతగలిగినా నాయకుని యెడాటాన
వినయములే వన్నె వెలఁదికిని
చన వెంటయిచ్చినాను సరసమాడేటివేళ
పెనగకుండుటే కడుఁబెద్దరికము
॥కొమ్మ॥
యెగ్గులేక వలచి తానెంత పచ్చిమాఁటాడినా
సిగ్గు నెరపుటే వన్నె చెలియకును
వెగ్గళించి యాతఁ డెంతవేడుకకు నవ్వనాను
వొగ్గి గుట్టుతో నుండు టొరపరితనము
॥కొమ్మ॥
వొలిసి శ్రీవేంకటేశుఁ డురముపై నిడుకొన్నా
లలి మొక్కుటే మేలు యలమేల్ మంగకు
కలసి మెలసి యెంతకాఁపురము చేసినాను
తలఁపులో మెలఁగుటే తగవైననేరుపు
॥కొమ్మ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము