Display:
శృంగార సంకీర్తన
రేకు: 1450-5
సంపుటము: 24-299
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
తానిక నెప్పుడు నాపై దయదలఁచీనే
ఆనవెట్టి యాతనినే యడుగరే చెలులు
॥పల్లవి॥
కలువ లేమిటికిఁ గారింపులాయనే
తలపోఁత లేఁటికిఁ దరవాయనే
చిలుకపలుకులేల చిరుచేఁదులాయనే
అలరినరమణుని నడుగరే చెలులు
॥తాని॥
కాసేటివెన్నెలలేల కడువేఁడులాయనే
ఆసలు జిగురులై యే లంటుకొనెనే
వాసనైన గాలి యేల పడ చల్లఁజొచ్చెనే
ఆసుద్దలెల్లాఁ బతి నడుగరే చెలులు
॥తాని॥
పొదలతుమ్మిదలేల పొంచి తమిరేచీనే
ఆదరుఁజన్నులేల ఆముకొనినే
అదన నలమేల్ మంగనైన నన్ను తాఁ గూడె
అదె శ్రీ వేంకటేశ్వరు నడుగరే చెలులు
॥తాని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము