Display:
శృంగార సంకీర్తన
రేకు: 1491-3
సంపుటము: 24-543
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఎటువంటి వేడుకలో యెదలోనే గుబ్బతిలీ
కుటిలకుంతలి నేర్పు కొనసాగీనయ్యా
॥పల్లవి॥
చెలగి తప్పకచూచు సిగ్గుతోఁ దలవంచు
తలఁపులో నీరూపు దలపోసును
సెలవులనే నవ్వు చెలికిఁ బ్రియముచెప్పు
కలికిభావము చెప్పఁ గతలాయనయ్యా
॥ఎటు॥
కోరును మనోరథాలు గుట్టుతోడనే కరఁగు
సారె నేకాంతాన నుండు సంతోసించును
చేరి మాటాడ నూహించు చెమరించు మేనెల్లా
నీరజాక్షిచందములు నీవే యెంచుకోవయ్యా
॥ఎటు॥
పవళించు పానుపుపై భావరతి నోలలాడు
కవగూడి నీవు రాఁగాఁ గడుమెచ్చును
ఇవల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
జవరాలి కూటములు సంగతేయనయ్యా
॥ఎటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము