శృంగార సంకీర్తన
రేకు: 1491-4
సంపుటము: 24-544
రేకు: 1491-4
సంపుటము: 24-544
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
తానే వచ్చీఁగాక తరవులు వెట్టనేల కానుకలు మీచేనంపి కక్కసించవలెనా | ॥పల్లవి॥ |
తలఁపులం బారితేనే తనువులు సోఁకినట్టు అలయించి యతనిమే నంటవలెనా చెలిమిసేసితేనే చేతికిలోనైనట్టు చెలులచే రమ్మని చెప్పించవలెనా | ॥తానే॥ |
కమ్మి సుద్దులు వింటేనే కాఁగిలించుకొన్నట్టు సమ్మతిచేసి చేతులు చాఁచవలెనా పిమ్మటఁ బేరుకొంటేనే ప్రేమం దనివైనట్టు రమ్మని పిలిపించి రతిసేయవలెనా | ॥తానే॥ |
యీడకు విచ్చేసితేనే యెడవాయకుండినట్టు జోడైయుండ నొడఁబఱచుకోవలెనా కూడె శ్రీవేంకటేశుఁ డిక్కున నలమేల్మంగను జాడతోడ తనమోవి చవిచూపవలెనా | ॥తానే॥ |