Display:
శృంగార సంకీర్తన
రేకు: 1501-1
సంపుటము: 25-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
నీవు మొదలిజాణవు నీకంటే జాణలు వారు
కావరపు నిన్నుఁ జూచి కన్నుల నవ్వేరు
॥పల్లవి॥
గుట్టున నెవ్వతెనో కూడవలసి యందరి
నట్టే పనులు చెప్పి యంపేవు నీవు
నెట్టన గొంద రిందులో నీతలంపు తామెరిఁగి
చుట్టి చుట్టి నీవద్దనే సుద్దులు చెప్పేరు
॥నీవు॥
పొద్దున నెవ్వరింటికో పోవలసి ఇంటివారి
నిద్దురలు వొమ్మనేవు నెమ్మది నీవు
వుద్దండపుకాంత లిది వూహించి తాము దెలిసి
వొద్దికతోఁబాదములు వొత్తేరు నీకును
॥నీవు॥
సందడి నెవ్వతెతోనో సరసమాడవలసి
అందరి వసంతాలాడుమనేవు నీవు
ఇందె శ్రీ వేంకటేశ నే నెఱింగితేఁ గూడితివి
విందు చెప్పి కొందరైతే వేడుకఁగూడేరు
॥నీవు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము