Display:
శృంగార సంకీర్తన
రేకు: 1544-2
సంపుటము: 25-200
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
సేయనీవే అతఁడిట్టె సేసినంతాను
కాయకపుఁ బ్రియములు గట్టిపడీనా
॥పల్లవి॥
వెక్కసా లాడకువే నావిభునితోను
నిక్కి వంకలు దిద్దఁగ నీవసమా
కక్కసానఁ బెట్టకువే ఘనని నీవు
పక్కనఁ దలపోఁతలు పాటివచ్చీనా
॥సేయ॥
నెరుసులు వట్టకువే నీవతనిని
దొరతనము వంచఁగ దోఁటి గలదా
పెరచేఁచకువే యిఁకఁ బ్రియములెల్ల
తెర మరుగుఁడగానే తేటతెల్లమవునా
॥సేయ॥
కొంగువట్టి తియ్యకువే గురిగా నీవు
జంగిలిసరసములు చవి వుట్టీనా
కంగు వాయ శ్రీవేంకటేశుఁడు నన్నఁ గూడె
అంగడినవ్వులలోనే ఆస మానీనా
॥సేయ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము