Display:
శృంగార సంకీర్తన
రేకు: 1642-6
సంపుటము: 26-251
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
చల్లఁగా బతుకవయ్య జాణతనాలు నేర్తువు
యెల్లచోట నిఁక దప్పు లెంచేమా నిన్నును
॥పల్లవి॥
నేను విన్నవినికికి నీవుండేవునికికి
కానీలేరా అన్నీఁ దారుకాణ వచ్చెను
ఆసలేల పెట్టేవు అమరనేల చెప్పేవు
దానికేమి యెవ్వరైనాఁ దడవేరా నిన్నును
॥చల్లఁ॥
చేరి నాపూహలకు చేసేటి నీ చేఁతలకు
సారెకు నౌరా నేఁడు సరివచ్చెను
యీరీతేల కిందుపడే విచ్చకాలేల సేసేవు
నీరపమైతే నౌఁగాక నిలిపేరా నిన్నును
॥చల్లఁ॥
యిట్టె నేఁ గూడిందుకు యెన్నిక నీరతులకు
గట్టాయరా నీగుణాలు కతలాయను
నెట్టన శ్రీవేంకటేశ నీ వెంతవేఁడుకొనేవు
చుట్టమవైతివి యిఁక సోదించేరా నిన్నును
॥చల్లఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము