Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 244-6
సంపుటము: 3-253
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
ఏమని చెప్పగవచ్చు నీసంతోషవుసుద్ది
నామము శ్రీకృష్ణుఁడట నారాయణునికి
॥పల్లవి॥
జనని దేవకిదేవి జనకుఁడు వసుదేవుఁ-
డనఘుడైనయట్టి ఆదిమూర్తికి
ఘనలోకరక్షణ కంసుమామ గండమును
తనకుఁ గారణమట దైవశిఖామణికి
॥ఏమ॥
పుట్టినది మధుర పెంపుడుఁజోటు రేపల్లె
వొట్టిన మాయల పురుషోత్తమునికి
పట్టిన పాండవపక్షపాతము కౌరవవైర-
మిట్టి వ్రాఁతఫలమట యీశ్వరేశ్వరునికి
॥ఏమ॥
గోవులఁ గాచేదియు గొల్లెతలఁ బొందేదియు
ఆవేళ గుణము యీ యచ్యుతునికి
శ్రావణబహుళాష్టమి చంద్రోదయము రోహిణి
కావింప జన్మమిదివో శ్రీవేంకటపతికి
॥ఏమ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము