అధ్యాత్మ సంకీర్తన
రేకు: 246-6
సంపుటము: 3-265
రేకు: 246-6
సంపుటము: 3-265
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇంక నా దైన్యము చూచి యెట్టు రక్షించేవో కాని సంకె దీరఁ బులిసితి సర్వేశ్వరా | ॥పల్లవి॥ |
తపము సేసి నీ మాయ దాఁటేననుచుఁ బెనఁగి అపుడే యలసితిని అదివో నేను కృపఁ జూచి నీ వింక గెలిపించేదెట్టోకాని వుపమల సరివోరి వోడితి నే వానికి | ॥ఇంక॥ |
పంచేంద్రియములను పారఁదోలేనని చూచి వంచఁగ సత్వలేక వసమైతిని అంచె నాపాటు చూచి నీవడ్డమౌటెప్పుడోకాని దించని బీరములాడి దిగితి నే వానికి | ॥ఇంక॥ |
మోహాంధకారముపై మొనచూపేనని పోయి సాహసము లేక నే జడిసితిని వూహల శ్రీవేంకటేశ వున్నతి నన్నేలితివి బాహుబలమున తుదిపదమయితి వానికి | ॥ఇంక॥ |