Display:
శృంగార సంకీర్తన
రేకు: 1701-1
సంపుటము: 27-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
అన్నిటా నేర్పరులైతి రౌనయ్యా
పన్ని పానుపుమీఁదటఁ బవళించరయ్యా
॥పల్లవి॥
పెనఁగఁగఁ బెనఁగఁగఁ బెంజెమటలు గారీని
మనసు లొక్కటులాయ మానరయ్యా
వనితకు నీకును వలపులు సరిదాఁకె
ననుపు లొనగూడెను నవ్వరయ్యా
॥ఆఁట॥
తగులఁగఁ దగులఁగ తమకములు రేఁగెను
తగు నిద్దరికి సిగ్గు దాఁచుకోరయ్యా
మొగముల నీకు నీకు ముంచె నివె కళలెల్లా
తగవాయ వేడుకలఁ దనివందరయ్యా
॥ఆఁట॥
కూడఁగఁ గూడఁగ కూరిములు నిండుకొనె
జోడాయ మీతనువులు చొక్కరయ్యా
తోడనె శ్రీ వేంకటేశ దొరసె మీరతులెల్లా
పాడితో నేకాలమునుఁ బాయకుండరయ్యా
॥ఆఁట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము