Display:
శృంగార సంకీర్తన
రేకు: 1702-1
సంపుటము: 27-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
రమణుఁడ నా మనసరయవు గాక
సముకాననే సేసచల్లఁగ వద్దనేనా
॥పల్లవి॥
యెమ్మెల వూరకే బయలీఁదించవద్దు గాని
కమ్మి నీ వింటికిరాఁగాఁ గాదనేనా
నమ్మికల కూరకే నవ్వు నవ్వవద్దు గాని
చిమ్ముచు బత్తితో నేమి సేసినా వద్దనేనా
॥రమ॥
అగడుగా యెడమాట లాడించవద్దు గాని
తగిలి చన్నులంటఁగాఁ దగదనేనా
సొగిసి యాసలఁబెట్టి జోలిసేయవద్దు గాని
వొగి నెంత పెనఁగినా నోపననేనా
॥రమ॥
ఇచ్చకములాడి నన్ను యెలయించవద్దుగాని
కొచ్చి యిట్టె యేలితివి కూడదనేనా
అచ్చపు శ్రీ వేంకటేశ అలమేలుమంగ నేను
నిచ్చా సేవ సేయుమంటే నేర ననేనా
॥రమ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము