శృంగార సంకీర్తన
రేకు: 1728-2
సంపుటము: 27-164
రేకు: 1728-2
సంపుటము: 27-164
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఇంతిని మన్నించుటకు నిదేవేళ వింత సేయక లోనికి విచ్చేయరాదా | ॥పల్లవి॥ |
రచ్చలఁబడె వలపు రాసులై నిండె వలపు యిచ్చట నాయకుడవు యేమి సే సేవు పచ్చకప్పురపు ధూళిపాలాయ విరహము తచ్చిచూచి ఇఁక దయఁతలఁచరాదా | ॥ఇంతి॥ |
దొంతులు నిండెఁ గోరిక దొడ్లు చొచ్చెఁగోరిక ఇంతు లిందరిలో నీవు యేమి సే సేవు చింత చెక్కిటిచేఁతికి సెలవాయ జవ్వనము కాంతుఁడ వీపె నింతటఁ గరుణించరాదా | ॥ఇంతి॥ |
అడియాలమాయ రతి ఆయములంటెను రతి యెడయకు మక్కడ నీవేమి సేసేవు చిడుముడి గూడితివి శ్రీ వేంకటేశ సతిని పిడికిటిపాలఁ గృపపెట్టఁగరాదా | ॥ఇంతి॥ |