Display:
శృంగార సంకీర్తన
రేకు: 1767-3
సంపుటము: 27-400
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
చేరి నీకు విన్నపాలు సేసేవారమా
కూరిమితో నీవే పైకొందువుగాక
॥పల్లవి॥
పిలువ నేరుతుమా పేరుకుచ్చి నిన్నంత
చెలరేఁగి నీవే లిచ్చేతువు గాక
సొలయ నేరుతుమా చూచి చూచి నేము నిన్ను
తలఁపులోపల దయదలఁతువు గాక
॥చేరి॥
నవ్వఁగ నేరుతుమా ననుపుతో నీతోను
అవ్వల నీవే సరసమాడుదుగాక
రవ్వసేయ నేరుతుమా రాజసాన నీవే వచ్చి
పువ్వువంటి వలపు పైఁబోతువు గాక
॥చేరి॥
మెచ్చఁగ నేరుతుమా మించి నన్నుఁ గూడితివి
చెచ్చెర నీవే సంతసింతువు గాక
యిచ్చకుఁడ శ్రీ వేంకటేశ మనరతులెల్ల
తచ్చి యాడనేరుతుమా తనుతువు గాక
॥చేరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము