Display:
శృంగార సంకీర్తన
రేకు: 1802-2
సంపుటము: 28-7
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎదుట నున్నాఁ డితఁడు యేల సిగ్గులు వడేవే
అదనాయ సంతోసము లడఁచఁగ నేఁటికే
॥పల్లవి॥
మనసు దెలుసుకొంటే మాటలాడఁగవలె
ననుపు గలిగితేను నగవలెను
పెనఁగనేరిచితేను పిలిచి పైకొనవలె
చనవు గలిగితేను సాదించవలెను
॥ఎదు॥
తగులాయ మైతేను తమకము చూపవలె
మొగమోట లబ్బితేను మొక్కవలెను
చిగిరించే యాసలకు చెప్పినట్టు సేయవలె
తగ వావులొనరితే దక్కి వుండవలెను
॥ఎదు॥
వేడుకలు వుట్టితేను విడెము లందుకోవలె
యీడైన వయసులైతే నెనయవలె
కూడె నిన్ను నిప్పుడే చేకొని శ్రీవేంకటేశుఁడు
వాడిక లిట్టే కలితే వలవఁగవలెను
॥ఎదు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము