Display:
శృంగార సంకీర్తన
రేకు: 1811-1
సంపుటము: 28-58
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నీ విఁక నేమన్నాను నీకు నీతోడు
కైవసమాయఁ బనులు కడమ లే లిఁకను
॥పల్లవి॥
వలిపెపయ్యదలోని వాసనగుబ్బలతోడు
పలుకవే చలములు పచరించక
పలచనైన నీ పచ్చికెమ్మోవితోడు
సొలసి తలవంచక చూడవే నాదిక్కు
॥నీవిఁక॥
సిగ్గులుదాఁచికట్టి చెంగావి చీరతోడు
వొగ్గి పట్టవే విడెము వుద్దండాలేల
దిగ్గనఁ గస్తూరి యలఁదిన నీచంకలతోడు
దగ్గరి కూచుండవే వింతలేల నీకు
॥నీవిఁక॥
తరితీపు చూపుల నీతళుకుఁ గన్నులతోడు
గిరిగొన నీట్టె కాఁగిట నించవే
చిరిఁజెమటలతోడి శ్రీవేంకటేశుఁడ నేను
మెరసె నీనా పొందు మితిమీరి యిపుడు
॥నీవిఁక॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము