Display:
శృంగార సంకీర్తన
రేకు: 1811-2
సంపుటము: 28-59
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
నీ చిత్త మిటమీఁద నేము చెప్పేటిదేమి
చేచేతఁ గూడి దయసేయవలెఁ గాక
॥పల్లవి॥
పేరుకొని యొకమాఁటు పిలుచు వూరక నిన్ను
కోరు మనసునను నీకూటంబులు
దూరు దైవంబు నటు తుదరెప్ప లందుఁగ -
న్నీరు నించును సారె నెలఁత నినుఁ దలఁచి
॥నీచి॥
భావించి యొకమారు పలకపై నిను వ్రాసు
వేవేగఁ దలయూఁచ వరగుపడును
నీవు రాఁగలుగను నిట్టూర్పు నిగుడించు
పూవుఁ బాన్పునఁ బోరలు పొలతి నినుఁ దలఁచి
॥నీచి॥
పక్కనను నొకమాఁటు బయలు నీతో నవ్వు
చెక్కు చేతనుఁ జేర్చు చింతించును
ఇక్కడనె శ్రీవేంకటేశ ఇదె కూడితివి
వెక్కసంబుగఁ బొగడు వెలఁది నినుఁ దలఁచి
॥నీచి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము