శృంగార సంకీర్తన
రేకు: 1811-3
సంపుటము: 28-60
రేకు: 1811-3
సంపుటము: 28-60
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
తగును మీ ఇద్దరికి తలఁచుకో నా మాఁట నెగడె మీ కూటములు నిక్కములు నేఁడు | ॥పల్లవి॥ |
వదలఁదగునా ప్రియము వలపుగలవారికిని యెదురుకొని వినయములు హెచ్చవలెఁగాక చెదరఁదగునా మనము చెలిమిగలవారికిని పొదలి ఇచ్చకములనే పొరలవలెఁగాక | ॥తగు॥ |
విడువఁదగునా యాస వేడుకగలవారికిని వుడివోని తమకమున నుండవలెఁగాక కడవఁదగునా మాట కైవసవువారికిని కొడిసాగఁబను లియ్యకొనఁగవలెఁగాక | ॥తగు॥ |
మఱవఁదగునా మేలు మమతగలవారికిని మెఱసి రతులను నేర్పు మించవలెఁగాక వెఱవఁదగునా చనవు వెలఇంచువారికిని యెఱిఁగి శ్రీవేంకటేశు నెనయవలెఁగాక | ॥తగు॥ |