Display:
శృంగార సంకీర్తన
రేకు: 1854-3
సంపుటము: 28-314
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తోండి
అప్పటిఁ బంతాలాడే వాపెతోడను
ఇప్పడే రతి నలసే వెట్టు గెలిచేవయా
॥పల్లవి॥
మాఁటలనే చెలియ నీమసల్లాఁ గరఁగించె
గాఁటపు గుబ్బల నొత్తి కళ రేఁచెను
చీటికి మాటికి నవ్వి సిగ్గులు జారఁగఁదోసె
యీటు వెట్టుకొని యీకె నెట్టు గెలిచేవయా
॥అప్ప॥
చెనకి చెనకి నినుఁ చేతికి లోఁజేసుకొనె
కనుచూపుల నిన్నుఁ జొక్కఁగఁజేసెను
పెనఁగులాటలనే ప్రియుములు పుట్టించె
ఇనుపమడించె నిన్నీకె యెట్టు గెలిచేవయా
॥అప్ప॥
తగులై వద్దఁ గూచుండి తమకము వొడమించె
జగిమోవి చవి చూపి చెంగలించె
నిగిడి శ్రీవేంకటేశ నిన్నుఁ గూడి వలపించె
యిగిరించెఁ గోర్కు లీకె నెట్టు గెలిచేవయా
॥అప్ప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము