Display:
శృంగార సంకీర్తన
రేకు: 1857-1
సంపుటము: 28-329
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఆసల నెదురుచూచీ అతివ నీకు
సేస చల్లి యిట్టె దయసేయఁగరాదా
॥పల్లవి॥
మాఁటలనే కొంతవొద్దు మంతనాలఁ గొంతువొద్దు
యేఁటికి జంపులఁ బెట్టే విప్పడు నీవు
ఆఁటదాని నింతేసి అలయించనేమిటికి
వాఁటమాయ వలపుల వచ్చితే రారాదా
॥ఆస॥
పందే లాడ వేళలేదా పాట విన వేళలేదా
ఇందాఁకాఁ గాచుకుండితి నెంతపరాకు
పొందుసేసినట్టి చోట పొరపొచ్చాలు సేతురా
అందుకొంటివి కానుక లాడకే రారాదా
॥ఆస॥
పిలిపించుకోవలెనా పెనఁగ నింట వలెనా
తలఁచుకోవద్దా యీకె తగులాయము
యెలమి శ్రీవేంకటేశ యేలితి వింతలో వచ్చి
తిలకించి ఇట్టె దినదినము రారాదా
॥ఆస॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము