Display:
శృంగార సంకీర్తన
రేకు: 1858-4
సంపుటము: 28-338
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎంతని విన్నవించేము యింతి నీపైఁ గల బత్తి
సంతోసాన నీతో పొందు సారె మాకుఁ జెప్పడు
॥పల్లవి॥
యెదురెదురే చూచు యేపొద్దు నిన్నే తలఁచు
మదిరాక్షి చెలులతో మంతనమాడు
చెదరిన సరులతో చెక్కు చెమటలతోడ
నిదుర గంటఁబెట్టదు నీపై తమి యెట్టదో
॥ఎంత॥
నీ మీఁది పాటలు వాడు నిలువునఁ జెంగలించు
ఆముకొని నిట్టూరుపు లడరించును
దీమసపు గుట్టుతోడ తెగని యాసలతోడ
నీమాటలే యాలకించు నీపై తమి యెట్టిదో
॥ఎంత॥
మలగు మీఁద మరగు మదనకళలు రేఁగు
కలలు గను నూరకె కాఁగిలించును
వెలఁది నిందు వచ్చి శ్రీవేంకటేశ కూడితివి
నిలిచి నిన్నుఁ బాయదు నీపై తమియెట్టిదో
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము