Display:
శృంగార సంకీర్తన
రేకు: 1897-2
సంపుటము: 28-570
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఇప్పడుగా రమణుఁడ యీడేరె నా కోరికలు
తప్పక నాపై దయ దలఁచితివి నీవు
॥పల్లవి॥
కామించి నిన్నుఁ బాసిన కడలేని విరహాగ్ని
నీమేని చెమట పన్నీటఁ జల్లారె
ప్రేమఁ దలపోఁతలఁ బెనగొన్న చీఁకటి
వేమరు నీ చిరునవ్వు వెన్నెలచే బాసెను
॥ఇప్ప॥
గక్కన నిన్నుఁ జూడని కలువకన్నులవాడు
చొక్కి నీవదనచంద్రుఁ జూచి తేరెను
నిక్కి కొప్పువీడిన నెరిఁదేఁటుల కలఁక
తక్క కిట్టె నీకరపద్ద(ద్మ?) ము లంటి జారెను
॥ఇప్ప॥
చేరి నిన్ను నెయని సిగ్గుల చిత్తజు చొక్కు
దారకపు నీ మాఁట మంత్రాలఁ దెలిసె
యీరీతి శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
గారవపు వలపుల కాఁపురా లమరెను
॥ఇప్ప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము