Display:
శృంగార సంకీర్తన
రేకు: 1901-1
సంపుటము: 29-1
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఎన్ని వేసాలు సేసేరు యెఱఁగనంటా నాతో
సన్నలనే యిందాఁకా సాములు జరపరా
॥పల్లవి॥
ఆద్దములు చూచుకొంటా నాకె నీవు నవ్వుకొంటా
యిద్దరును నుండరా యేకతానను
సుద్దులు చెప్పుకొంటాను సొమ్ములువెట్టుకొంటాను
గద్దెమీఁదఁ గూచుండి కాఁపురాలు సేయరా
॥ఎన్ని॥
గందములు వూసుకొంటా కాఁగిటఁ బెనఁగుకొంటా
సందడివలపులెల్లాఁ జల్లరా మీరు
అంది విడే లిచ్చుకొంటా ఆయాలు గరఁగుకొంటా
పెందలకాడను మీరు పెండ్లిండ్లాడరా
॥ఎన్ని॥
సరసము లాడుకొంటా సారె మోవు లానుకొంటా
విరులవేట్లాడరా వేడుకతోను
ఇరవై శ్రీవేంకటేశ ఇట్టె నన్నేలితిగాక
సొరిది మీలో మీరు చుట్టములే కారా
॥ఎన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము