శృంగార సంకీర్తన
రేకు: 1949-6
సంపుటము: 29-234
రేకు: 1949-6
సంపుటము: 29-234
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
తన మేలుదాననని తలఁపునఁ బెట్టుమను వినయముతోఁ జెలి విన్నవించి రావె | ॥పల్లవి॥ |
చిత్తమున నెట్టుండెనో చిమ్మితిఁ గొనగోరను కొత్త సతుల సుద్దుల కోరి చెప్పఁగా వొత్తి మాఁటలాడితి వొద్ద నందరు నుండఁగా తత్తరుపుఁ గాంతలను తప్పక చూడఁగను | ॥తన॥ |
కోపగించఁడుగదా గొణఁగుతాఁ దిట్టితి రాఁపుల సతులతో సరసమాడఁగా కాఁపురము సేయుమని గయ్యాళించి పెనఁగితి పైపై దిమ్మరితనాలపడఁతుల నంటఁగా | ॥తన॥ |
సంతోసించుకొనెనో సాగిలి నే మొక్కితి చింతదీర నామీఁదనే సేస చల్లఁగా ఇంతలో శ్రీవేంకటేశుఁ డేలఁగా దేవులనైతి మంతనాన నన్నే కడు మన్నించఁగాను | ॥తన॥ |