Display:
శృంగార సంకీర్తన
రేకు: 1950-2
సంపుటము: 29-236
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
చెప్పఁబోతే వెరగయ్యీ చెలి మేలు దాఁచరాదు
వుప్పతిల్లు రతులను వోలలాడుమనవే
॥పల్లవి॥
కుప్పలాయఁ బులకలు కోమలి చెక్కులవెంట
రెప్పలనే యలపు దేరీ నిదివో
చిప్పిలి చెమట లెల్లాఁ జిమ్మిరేఁగఁ జొచ్చె మేన
యెప్పుడు వచ్చీనే విభుఁ డేమిసేసీనే
॥చెప్పఁ॥
చిత్తమెల్లా నీరాయ సేసకొప్పు చెదరెను
హత్తిన గుబ్బలపై పయ్యద జారెను
వత్తివలెఁ గెమ్మోని వసివాడి తేనెగారీ
బత్తిసేసి తా నెప్పుడు పడఁతి నేలీనే
॥చెప్పఁ॥
నిట్టూరుపులతోడ నిండుకొనెఁ గోరికలు
దట్టమాయ లోలోని తలపోఁతలు
ఇట్టె శ్రీవేంకటేశుః డింతిఁ గూడె నిందు వచ్చి
జట్టిగొనె నింకా నెంత చనవు లిచ్చీనే
॥చెప్పఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము