Display:
శృంగార సంకీర్తన
రేకు: 1992-4
సంపుటము: 29-490
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
చెలియ మంచిగుణాలు చిత్తమునఁ బట్టెనా
వెలయ నిన్నియు విన్నవించితి నే నీకు
॥పల్లవి॥
మొగము చూచి నీతో ముచ్చటలే యాడుఁగాని
యెగసక్కే లాడనేర దెంతైనా సతి
నగుతాను వద్దనుండి ననుపే నడపుఁగాని
వెగటులు చూపి మోపి వేసరించఁ జాలదు
॥చెలి॥
మంతనాన సేవసేసి మచ్చిక నెరపుఁగాని
పంతములు నీ ముందర బచారించదు
సంతోసాన మోవి చూపి చవులు గొలుపుఁగాని
వింత సేసుకొని నిన్ను వెంగన సాదించదు
॥చెలి॥
కందువకు నిన్నుఁ దీసె కాఁగిలించుకొనుఁగాని
మందెమేళమున నీకు మట్టుమీరదు
ఇందుకే శ్రీవేంకటేశ యీకె నిట్టె యేలితివి
సందడి నీ రతులకు జవదాటదు
॥చెలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము