శృంగార సంకీర్తన
రేకు: 1992-5
సంపుటము: 29-491
రేకు: 1992-5
సంపుటము: 29-491
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
వేగమే యానతీవమ్మా విన వేడుకయ్యీ నాకు యీ గతి నున్నవి నీ ఇంగితాకారములు | ॥పల్లవి॥ |
కాంతునిమై గురుతులు కంటివో యేమైనాను చెంతనుండి నవ్వేవు చిరునవ్వులు వింత సుద్దు లేమైనా వింటివో యాతనిమీఁద ఇంతలోనే చెలులతో నేకాంతా లాడేవు | ॥వేగ॥ |
చేతికి నంగమచ్చాలు చిక్కెనో నీకేమైనా కాతరాన సొలసేవు కమ్మటి నీవు నీ తలపున నేమైనా నెపములు వారెనో పోతరించి లోలోఁ దలపోసుకోనేవు | ॥వేగ॥ |
నిక్కముగా నాతని నిజము దెలిసితివో గక్కన శ్రీవేంకటేశు గాఁగిలించేవు ఇక్కువలు గరఁగి నీ యెన్నిక లీడేరెనో వుక్కుమీరి కలలెల్లా నుప్పతిలీ నీకును | ॥వేగ॥ |