Display:
శృంగార సంకీర్తన
రేకు: 1992-6
సంపుటము: 29-492
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
కాదని తొలఁగరాదు కైకొని మెలఁగరాదు
యీ దెస నాతని చిత్త మెట్టుండునో
॥పల్లవి॥
వొత్తి మాఁటలాడితేను వొకటొకటె తోఁచును
మత్తిలి నవ్వు నవ్వితే మందెమేళమౌ
బత్తి సేయఁగా జేయఁగా పైపై మొగచాటౌను
ఇత్తల పతితోఁ బొందు లెటువలె జేతునే
॥కాద॥
సారె సరస మాడఁగా చలములు మీరి వచ్చు
చేరి చేరి చూడఁగాను సిగ్గులు నిండు
మేరిమీరి కొసరఁగా మిక్కిలి వేసటలౌను
నేరుపులు వచరించ నే నెట్టు నేరుతునే
॥కాద॥
చెనకి కాఁగిలించితే చిత్తము నీరై కరఁగు
పెనఁగితే తమకములు పెచ్చు వెరుగు
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేఁడు
పను లీతనివి యెంత పచారించవచ్చునే
॥కాద॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము