Display:
శృంగార సంకీర్తన
రేకు: 1998-3
సంపుటము: 29-525
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
నెలఁతల జాడ లివి నేర మెంచేవు గనక
పలుమారు ననఁగా నీ బత్తిగలఁ జుమ్మీ
॥పల్లవి॥
కూరిమి గలిగినది గుట్టుతోనే వుండుఁగాని
చేరి పతితో సారెఁ జెప్పుకొనదు
గారతపు జవరాలు కడు సిగ్గువడుఁగాని
మేరమీరి యందరిలో మేలము లాడదు
॥నెల॥
చక్కఁదనము గలది సాజాననే వుండుఁగాని
పక్కనను రూపు చూపి భ్రమయించదు
నెక్కొన్న చుట్టమైనది నేరుపులే చూపుఁగాని
కక్కసించి పెనఁగుతా గయ్యాళించదు
॥నెలఁ॥
మంచిగుణము గలది మరి ఇచ్చలాడుఁగాని
ముంచి రతి మందెమేళములు సేయదు
యెంచఁగ శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
వంచెనతోడిది యేగర్వయులనటించదు
॥నెలఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము