సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 137 సంకీర్తన: 139
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 37
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 137 సంకీర్తన: 139
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 37
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: గుజ్జరి
ఇన్ని యుపాయము లింక నేడ కెక్కు శ్రీహరి పన్ని నీ [1]మఱఁగు చొచ్చి పాయకుండీఁ గాక | ॥పల్లవి॥ |
అనంతకోటి జన్మములందుఁ జేసిన పాపములు మొనసి నే నొక జన్మమున నీఁగినా ననిచి కర్మానుష్ఠానము నేఁడు సేయఁబోతే పనివడి ముంతనీట బడబాగ్ని ఆరునా | ॥ఇన్ని॥ |
పెక్కు కవిలెలవ్రాఁత కుంభీపాకరౌరవాలు వొక్క దేహాననే పొంది వుత్తరించేనా తక్కక నేఁడీ ఘోరతపములు [2]సేయఁబోతే గక్కన జలధి బుఱ్ఱకాయ నిండేనా | ॥ఇన్ని॥ |
బలువై అనాది వేళ్లు వారిన సంసారము తలమోచి నేఁడింతలో తవ్వివేసేనా నెలవై శ్రీవేంకటేశ నే నేఁడు పుణ్యమంటితే చెలఁగి పెను[3] గాలికి చింపిచేఁటలడ్డమా | ॥ఇన్ని॥ |
(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 10వ సంకీర్తనగా ఉంది.)
[1] మరంగు
[2] శాయంబోతే
[3] ఘాలికి