Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 267 సంకీర్తన: 282
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 44
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి - జంపె
ఉవిదతనులత యేఁటికులికి పడెనే
కవ మదనబాణాగ్నిఁ గాఁగదుగదా
॥పల్లవి॥
వనితలావణ్యంపు వదనశశికలములు
చనుగిరులపైనేల జారిపడెనే
వెనకఁదుర(రు?)మను రాహు వేవేలు రూపులై
తనర ముఖచందురుఁడు తలకఁడుగదా
॥ఉవిద॥
మొలకలై గుమురులై ముదితమై మరునంప-
ములుకులంతటనేల ముణుఁగఁబడెనే
పొలయు మరునస్త్రమటు[1] పుంఖానుపుంఖములు
పొలఁతిమీఁదనె రాశివోయఁడు గదా
॥ఉవిద॥
కొమరైన పెనుదండు కుసుమాయుధుఁడు గదలి
తెమలి రాకిపుడెట్లఁ దిరుగఁబడెనే
విమలాంగికౌఁగిటను వేంకటేశ్వరునిఁ గని
భ్రమసి ప్రతిదండనుచు పదరఁడుగదా
॥ఉవిద॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 348వ సంకీర్తనగా ఉంది.)

[1] ములు
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము