Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 170 సంకీర్తన: 175
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 45
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదనామక్రియ
ఎంతకత నడపితి వేమి జోలిఁ బెట్టితివి
చింతించ లోకములు నీచేతివే కావా
॥పల్లవి॥
కౌరవులఁ బాండవుల కలహము వెట్టనేల
నేరిచి సారథ్యము నెఱపనేలా
కోరి భూభార మణఁచే కొరకైతే నీచే చక్ర-
మూరకే వేసితే దుష్టు లొక్కమాటే తెగరా
॥ఎంత॥
చేకొని వానరులఁగాఁ జేయనేల దేవతల
జోకతో లంకాపురి చుట్టుకోనేల
కాకాసురు వేసినకసవే రావణుమీఁద-
నాకడఁ జంపువెట్టితే నప్పుడే సమయఁడా
॥ఎంత॥
గక్కన శ్రీవేంకటేశ కంబములో వెళ్లనేల
చొక్కముగాఁ బ్రహ్లాదుఁడు చూపఁగనేల
చిక్కక హిరణ్యకశిపునాత్మలో నుండక
తక్కించి నీవెడసితే తానే పొలియఁడా
॥ఎంత॥

(ఈ సంకీర్తన 2వ సంపుటంలో 315వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము