Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 34 సంకీర్తన: 33
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 46
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
ఎంతగాలమొకదా యీ దేహధారణము
చింతాపరంపరలఁ జిక్కువడవలసె
॥పల్లవి॥
వడిగొన్న మోహంబువలలఁ దగులై కదా
కడలేని గర్భనరకము లీఁద[1]వలసె
నడిమి సుఖములచేత ననుపు సేయఁగఁగదా
తొడరి హేయపుదిడ్డిఁ దూరాడవలసె
॥ఎంత॥
పాపపుంజములచేఁ బట్టువడఁగాఁగదా
ఆపదలతోడి దేహము మోవవలసె
చూపులకులోనైనసుఖము గానక[2] కదా
దీపనభ్రాంతిచేఁ దిరిగాడవలసె
॥ఎంత॥
హితుఁడైన తిరువేంకటేశుఁ గొలువకకదా
ప్రతిలేని నరకకూపమునఁ బడవలసె
అతని కరుణారసం బబ్బకుండఁగఁగదా
బతిమాలి నలుగడలఁ బారాడవలసె
॥ఎంత॥

(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 316వ సంకీర్తనగా ఉంది.)

[1] నరకగర్భమునఁ బడవలసె నిడురేకు 18
[2] గోరఁగఁగదా?
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము