Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 58 సంకీర్తన: 57
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 116
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము - ఏక
చూచేవారికి ధర్మము సులభమువలె నుండు
కాచి నమ్మి చేకొంటే ఘనునిఁగాఁ జేసును
॥పల్లవి॥
అరయ శ్రీపాదతీర్థ మల్పమువలె నుండు
వరుసఁ బాపములను వక్కలించును
వొరసి నీ నామ మొక్కమాటవలె నుండును
నరకములు తరించి నంటున రక్షించును
॥చూచేవారికి॥
మహి నీ పూజ తులసీదళమాత్రమువలె నుండును
యిహపరములు దానే యియ్య నోపును
అహరహము నీ చింత ఆందోళమువలె నుండును
విహితమై నీ కృపకు వెసఁ బాత్రుఁ జేసును
॥చూచేవారికి॥
చేరి నీకు మొక్కే మొక్కులు చేష్టలువలె నుండు
ధారుణిలో భవవార్ధి దాఁటించును
వూరకే నీ కిచ్చే కానుక వొక కాసువలె నుండును
యీరీతి శ్రీవేంకటేశ యే వరమైనా నొసఁగును
॥చూచేవారికి॥

(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 339వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము