Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 76 సంకీర్తన: 75
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 169
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము
నెలఁతఁ బాసి వుండలేను నిమిష మెందు నేఁడు నాకు
తలఁపులో నీవలెనే రతుల తరుణిఁ గలయు టెన్నఁడే
॥పల్లవి॥
ముదిత నాయెదుట నిలిచి మోసులువార నవ్వు నవ్వి
కదలుఁజూపులఁ జూచి నాకు కన్ను లార్చు టెన్నఁడే
వదలుఁ బయ్యద సవదరించి వలపుతేట చవులు చూపి
కొదలు మాటల ముద్దు గునిసి కూరిమి గొసరు టెన్నఁడే
॥నెలఁతఁ॥
చెలియ సిగ్గున మోము వంచి చెక్కునఁ జేయి మాటు సేసి
మలసి వీడె మిచ్చి ఆకు మడిచి యిచ్చు టెన్నఁడే
వలుద చన్ను లురము మోఁపి వాసన యూర్పు చల్లిచల్లి
కలయ మోవితేనె లొసఁగు కంచము పొత్తులెన్నఁడే
॥నెలఁతఁ॥
యింతి నన్నుఁ జేరఁ బిలిచి యింటిలోని పరపు మీఁద
దొంతికళలు రేఁగ నంటి దొమ్మి సేయు టెన్నఁడే
వింత లేక యిపుడె శ్రీవేంకటేశ్వరుఁడనైన
పొంతనున్న నన్నుఁగూడ పొద్దు దెలియు టెన్నఁడే
॥నెలఁతఁ॥

(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 20వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము