Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 62 సంకీర్తన: 61
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 172
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: లుప్తము
నేఁడే పెండ్లివేళ నేఁడే నాగవల్లి
ఆడుచు సోబానఁ బాడు మనరే చెలులూ
॥పల్లవి॥
కనకాంబరుఁ డతఁడు కనకకుచగిరి యీకె
కొనబుగల యిద్దరికిఁ గూడెఁ బొంతనము
వనజనాభుఁ డతఁడు వనజలోచన యీకె
ఘనమైన కంకణము గట్టరే చెలులు
॥నేఁడే॥
నీలవర్ణుఁ డతఁడు నీలకుంతలి యీకె
చాలుకొని యిద్దరికి జంట దగును
ఆలరైన శంఖధరుఁ డితఁ డీకె కంబుకంఠి
యీ లీల నారతులు యెత్తరే చెలులు
॥నేఁడే॥
జలధిశాయిని యతఁడు జలధికన్నెక యీకె
కలిగె నిద్దరికి వొక్క కైవాడము
అలరు శ్రీవేంకటేశుఁ డతఁ డీకె మహాలక్ష్మి
వెలయఁగల సిరి దీవించరే చెలులు
॥నేఁడే॥

(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 537వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము