Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 70 సంకీర్తన: 69
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 193
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: కాంబోది
పెనఁగకురే మీ రింత ప్రియునితోఁ బలుమారు
తనకు నిచ్చయినవేళ తలఁపు గలిగీని
॥పల్లవి॥
వలచి యలిగిన యలుక వడిఁ దేర్చవచ్చుఁ గాక
వొలసి నొల్లని యలుక లొకరి వశమా
మెలఁగి నిద్రించు విభుని మేలుకొలుపవచ్చుఁ గాక
తెలిసి వుండిన నిదుర తెగి లేపవశమా
॥పెనఁగకురే॥
చనవుగలిగినమాట చవిసేయవచ్చుఁ గాక
మనసు లెనయనిచోట మరుప వశమా
వినరే యాఁకటిపతికి విందు చెప్పవచ్చుఁ గాక
తనిసివుండినయపుడు తమ రేఁచ వశమా
॥పెనఁగకురే॥
పాయరాని చుట్టరికము పట్టిపెనఁగవచ్చుఁ గాక
కాయకపు వావులకుఁ గలయ వశమా
యీయెడల శ్రీవేంకటేశుఁడిటు ననుఁ గూడె
చాయలనాతనిమేలు జవకట్ట వశమా
॥పెనఁగకురే॥

(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 29వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము